వామ్మో!! మొబైల్ వాడితే ఇన్ని రోగాలొస్తాయా ?


మొబైల్ ఫోన్స్ వినియోగం వల్ల పబ్లిక్ మెటాబాలిజం బారినపడుతున్నారని ఓ సర్వే స్పష్టం చేసింది. మెటాబాలిజం అంటే మనిషి శరీరంలో రసాయనిక మార్పులు చోటుచేసుకోవడమన్నమాట. ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్‌ని మోతాదుకు మించి వినియోగించడంవల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతాయని ఓ ప్రచారం నడుస్తోంది. అయితే, క్యాన్సర్ మాత్రమే కాకుండా.. శరీరంలో అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, అజీర్ణం వంటి సమస్యలకు కూడా ఈ మొబైల్ వాడకమే ఓ కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తమ అధ్యయనంలో ఇదే విషయం తేలిందంటున్నారు ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి చెందిన రేడియేషన్ అంకాలజీ ప్రొఫెసర్ మనోజ్ శర్మ. వాస్తవానికి మొబైల్ ఫోన్స్ వాడకం వల్ల ఏయే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే కోణంలో ఇప్పటివరకు సుదీర్ఘ పరిశోధనలే జరగలేదంటున్నారు శర్మ. 
ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన మొబైల్ ఫోన్ రేడియేషన్ అండ్ హెల్త్ సదస్సులో పాల్గొన్న శర్మ మొబైల్ వాడకంపై అందరూ దృష్టిసారించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. మొబైల్‌ని మెదడుకు దగ్గరిగా పెట్టుకుని మాట్లాడటం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం లేకుండాపోలేదని... ఈ విషయంలో ఇప్పుడే శ్రద్ధ తీసుకోకపోతే ఇక భవిష్యత్‌లో ఏమీ చేయలేమని శర్మ అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ సందర్భంగా శర్మ మొబైల్ వాడకాన్ని పొగాకు వాడకంతో పోల్చారు. మొదట్లో పొగాకు కూడా ఇలాగే వచ్చింది. ఇప్పుడది ప్రపంచాన్నే హరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ఈ కోణంలో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ కొన్ని మొబైల్ తయారీదారులు వెనకుండి నడిపిస్తున్నవే.. అందుకే ప్రమాదకరమైన వాస్తవాలెన్నో వెలుగుచూడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారాయన.

No comments:

Post a Comment